Viswanathan Anand: ఎస్పీ బాలు గురించి ఆసక్తికర అంశాన్ని వెల్లడించిన చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్
- బాలు మృతి పట్ల క్రీడారంగంలోనూ విషాదం
- తమిళ చెస్ రంగానికి బాలు అండదండలు
- మద్రాస్ కోల్ట్స్ జట్టుకు నాడు స్పాన్సర్ గా వ్యవహరించిన వైనం
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం కళా రంగాన్ని మాత్రమే కాదు క్రీడారంగాన్ని కూడా విషాదంలో ముంచెత్తింది. బాలు మృతి పట్ల ఎంతో విషాదానికి లోనైనట్టు చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం ఎంతో గొప్ప వ్యక్తి అయినా, చాలా నిరాడంబరంగా ఉండేవారని కితాబిచ్చారు.
1983లో జాతీయ స్థాయిలో జరిగిన చెస్ చాంపియన్ షిప్ లో చెన్నై కోల్ట్స్ జట్టుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పాన్సర్ గా వ్యవహరించారని వెల్లడించారు. "ఆయనే నా తొలి స్పాన్సర్. నేను కలిసిన సహృదయులైన వ్యక్తుల్లో ఆయనొకరు. ఆయన గాత్రం ఎంతో ఉల్లాసాన్ని అందించింది. ఎస్పీ బాలు ఆత్మకు శాంతి కలుగుగాక" అంటూ విషీ ట్వీట్ చేశారు.
భారత చెస్ యవనికపై 1983-84లో విశ్వనాథన్ ఆనంద్ ఓ ప్రభంజనంలా వచ్చాడు. ఆ ఏడాది తమిళనాడు స్టేట్ జూనియర్ చాంపియన్ షిప్ గెలిచిన ఆనంద్ అదే ఏడాది జాతీయ సబ్ జూనియర్ చాంపియన్ షిప్ లో ఐదో స్థానం సాధించాడు. ఆనంద్ చెస్ లో అడుగుపెట్టిన సమయంలో చెన్నైలో ఎంతోమంది ప్రతిభావంతులైన చదరంగ క్రీడాకారులు ఉండేవారు. దాంతో జాతీయ చాంపియన్ షిప్ కోసం ప్రత్యేకంగా కుర్రాళ్లతో కూడిన జట్టును కూడా పంపాలని నాటి మద్రాస్ డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ (ఎండీసీఏ) నిర్ణయించింది.
అయితే వారికి నిధుల లేమి తీవ్ర సమస్యలా పరిణమించింది. ఈ సమయంలోనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నేనున్నానంటూ ముందుకొచ్చారు. బాంబేలో జరిగిన నేషనల్ చెస్ చాంపియన్ షిప్ లో మద్రాస్ కోల్ట్స్ జట్టు స్పాన్సర్ బాధ్యతలను ఎంతో పెద్దమనసుతో స్వీకరించారు. ఎలాంటి ఆర్థిక కష్టం కలగకుండా అన్నీ తానై వ్యవహరించారు. ఆ టోర్నీ ద్వారా విశ్వనాథన్ ఆనంద్ ప్రతిభ జాతీయ స్థాయిలో మార్మోగింది. ఆనంద్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ నజరానా కూడా అందుకున్నారు.