K.Viswanath: వాడు నా సోదరుడే కాదు నా ఆరోప్రాణం: బాలు మృతిపై భావోద్వేగాలకు లోనైన కె.విశ్వనాథ్
- దేవుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదని వ్యాఖ్యలు
- బాలు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్ష
- కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచన
సినీ నేపథ్య గాయకుల్లో శిఖర సమానుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంపై కళాతపస్వి కె.విశ్వనాథ్ భావోద్వేగాలకు గురయ్యారు. కరోనా చికిత్స పొందుతూ బాలు ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కొన్నిరోజుల కిందట కరోనా నెగెటివ్ వచ్చినా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉండడంతో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగించారు. అయితే నిన్న ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అందరినీ తీరని వేదనకు గురిచేస్తూ కన్నుమూశారు. దీనిపై కె.విశ్వనాథ్ ఓ వీడియోలో స్పందించారు.
భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలు తన సోదరుడే కాకుండా తన ఆరోప్రాణం కూడా అని పేర్కొన్నారు. బాలు ఇంత త్వరగా వెళ్లిపోతాడని ఊహించలేదని, ఇలాంటి సమయంలో ఏంమాట్లాడతామని ఆవేదన వెలిబుచ్చారు. "వాడి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని వాడి కుటుంబ సభ్యులు ఓర్చుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని ఆకాంక్షిస్తున్నాను" అని కె.విశ్వనాథ్ తెలిపారు. ఇంతకంటే ఇంకేమీ మాట్లాడలేనంటూ సెలవు తీసుకున్నారు.