SP Balasubrahmanyam: పాజిటివ్ అని తేలకముందు కరోనాపై పాట రూపొందించిన ఎస్పీబీ
- కరోనాపై అవగాహన కల్పించే ప్రయత్నం
- బాణీ, గాత్రం అందించిన బాలు
- చివరికి అదే మహమ్మారి కారణంగా మృత్యువాత
భాషలకు అతీతంగా గుర్తింపు తెచ్చుకున్న మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అత్యంత విషాదకర రీతిలో కన్నుమూశారు. కరోనాతో వారాల తరబడి పోరాడిన ఆయన, పరిస్థితి విషమించడంతో ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... తనకు కరోనా పాజిటివ్ అని తేలకముందు ఆయన ఈ మహమ్మారిపై అవగాహన కలిగించే ఓ చైతన్య గీతం రూపొందించారు.
ఈ పాటకు ఆయన స్వరాలు కూర్చి ఆలపించారు. సుప్రసిద్ధ తమిళ సినీ గీత రచయిత వైరముత్తు సాహిత్యం అందించారు. నాడు ఈ పాట గురించి బాలు ఓ వీడియోలో చెబుతూ, ఈ పాటలో సంగీతం కంటే సాహిత్యమే ముఖ్యమని, కరోనా పట్ల ఎలా వ్యవహరించాలో తెలిపే మాటలు ఇందులో ఉన్నాయని తెలిపారు. 'కరోనా కరోనా' అంటూ సాగే ఈ గీతంలో కరోనా క్రిమి చాలా చిన్నదని, ఓ అణువు కంటే చిన్నదని, కానీ అణుబాంబు లాగే ఎంతో ప్రమాదకరమైనదని వివరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దొంగచాటుగా దెబ్బతీస్తుందని తెలిపారు.
ఈ పాటను తమిళంలో రూపొందించారు. తాను కరోనాతో ఆసుపత్రిలో చేరడానికి కొన్నిరోజుల ముందే ఈ పాటను ఆలపించారు. విచారించాల్సిన అంశం ఏమిటంటే, ఎంతో అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన ఆయన చివరికి ఆ మహమ్మారి కారణంగానే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.