Bandi Sanjay: రథం కాలిపోతే చెక్క కాలిపోయిందంటారా?: కొడాలి నానిపై బండి సంజయ్ ఫైర్
- మోదీ, ఆదిత్యనాథ్‌పై నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా
- నేతల్ని కట్టడి చేయకుంటే తప్పుడు సంకేతాలు
- మత విశ్వాసాల విషయంలో రాజకీయ జోక్యం కూడదు
అంతర్వేది రథం దగ్ధం విషయంలో ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. రథం కాలిపోయి భక్తులు విచారంలో ఉంటే ఓ చెక్క కాలిపోయిందంటూ చేసిన వ్యాఖ్యలు భక్తుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతల్ని కట్టడి చేయకుండా మౌనం వహిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు.
మత విశ్వాలు, ఆచార, సంప్రదాయాల విషయంలో రాజకీయ నేతలు జోక్యం చేసుకుంటే వారి భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారని హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాల్లో రాజకీయ నేతలు తలదూర్చడం సబబు కాదని సంజయ్ హితవు పలికారు. అన్ని వర్గాలను సమదృష్టితో చూడాల్సిన పాలకులు ఓ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు.