David Warner: ఎవ్వరినీ అనవద్దు... తప్పు నాదే: సన్ రైజర్స్ ఓటమిపై కెప్టెన్ డేవిడ్ వార్నర్ భావోద్వేగం!

David Warner Comments on Defete with KKR

  • కేకేఆర్ తో మ్యాచ్ లో ఓటమి
  • తొలి ఓవర్ల రన్ రేట్ ను కొనసాగించలేక పోయాం
  • ఎవరినీ నిందించాలని భావించడం లేదు
  • మ్యాచ్ తరువాత డేవిడ్ వార్నర్

దుబాయ్ లో జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు, తమ రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. గత రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో తమ అభిమాన జట్టు ఓడిపోవడాన్ని సన్ రైజర్స్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ మ్యాచ్ లో కేన్ విలియన్సన్ ఆడకపోవడం, మనీశ్ మినహా మిగతా వారు ఎవరూ సరిగ్గా ఆడకపోవడంతో హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ ఓటమిపై సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించారు.

కేకేఆర్ తో ఆటలో జట్టు ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదని అంగీకరించిన వార్నర్, తొలి ఓవర్లలో లభించిన మంచి రన్ రేట్ ను కొనసాగించ లేకపోయామని అన్నాడు. ఇందుకు తాను ఎవరినీ నిందిచాలని భావించడం లేదని, తప్పంతా తనదేనని, ఈ ఓటమికి బాధ్యతను కూడా తీసుకుంటున్నానని అన్నాడు. తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడాలన్న ఆలోచనతో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన తాను, దాన్ని కాపాడుకోలేక పోయానని చెప్పాడు.

వరుణ్ చక్రవర్తి వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన తాను అనవసరంగా అవుట్ అయి, పెవీలియన్ చేరానని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయిన తమ జట్టు, బెంచ్ పై ఇద్దరు ప్రధాన బ్యాట్స్ మెన్ లను ఉంచుకుని కూడా పెద్ద స్కోరును సాధించడంలో విఫలం అయ్యామని అన్నాడు. ముఖ్యంగా 16వ ఓవర్ తరువాత వేగం పెంచాల్సిన ఆటగాళ్లు ఆ పని చేయడంలో విఫలం అయ్యారని అన్నాడు.

ఈ మ్యాచ్ లో దాదాపు 6 ఓవర్లు డాట్ బాల్స్ ఉన్నాయని, టీ-20లో ఇన్ని డాట్ బాల్స్ ఉంటే, మ్యాచ్ గెలవడం కష్టమవుతుందని, తదుపరి వచ్చే మ్యాచ్ లలో మైండ్ సెట్ ను మార్చుకుని బరిలోకి దిగుతామని అన్నాడు. బంతిని బౌండరీ దాటించే విషయంలో దుబాయ్ మైదానాలు క్లిష్ట పరిస్థితులను కలిగిస్తున్నాయని, బౌండరీల విషయంలో ఆటగాళ్లు మరింత ప్రాక్టీస్ చేసేలా చూస్తామని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News