President Of India: కేంద్ర నూతన వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రాజముద్ర
- నూతన వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చిన కేంద్రం
- బిల్లులకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం
- ప్రభుత్వ అనుకూల నిర్ణయం తీసుకున్న రామ్ నాథ్ కోవింద్
కేంద్రం ఇటీవల నూతన వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజాగా ఈ మూడు వ్యవసాయ సంబంధ బిల్లులకు రాష్ట్రపతి రాజముద్ర వేశారు. ఈ నూతన బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఓవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బిల్లులకు వ్యతిరేక వాతావరణం ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రభుత్వ అనుకూల నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది.
అయితే ఈ బిల్లులను పార్లమెంటులో వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపత్రి ఆమోదం ప్రవేశపెట్టినప్పటి నుంచే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. లోక్ సభ, రాజ్యసభల్లో ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలు ఆందోళనలు చేశాయి. అయినప్పటికీ ఎన్డీయే తన పంతం నెగ్గించుకుంది. అటు, ఎన్డీయే తీరుకు నిరసనగా శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి తప్పుకుంది. ఆ పార్టీకి చెందిన హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్రపతి వ్యవసాయ బిల్లులతో పాటు జమ్మూ కశ్మీర్ అధికార భాషల బిల్లుకు కూడా ఆమోద ముద్ర వేశారు.