SP Charan: మా నాన్నను అభిమానించేవాళ్లు ఇలా చేయరు... ఎంజీఎం ఆసుపత్రిపై రూమర్లు వద్దు: ఎస్పీ చరణ్ విజ్ఞప్తి
- డబ్బుకోసమే ఇన్నాళ్లు చికిత్స చేశారంటూ ప్రచారం
- ఈ ప్రచారాన్ని ఖండించిన ఎస్పీ చరణ్
- ఎంజీఎం డాక్టర్లు ఎంతో శ్రమించారని వెల్లడి
గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారినపడ్డ తర్వాత చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందించిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాత ఆయన కోలుకుంటున్నారని అందరూ భావించిన తరుణంలో హఠాత్తుగా ఆయన పరిస్థితి విషమించి కన్నుమూయడం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇన్నిరోజుల పాటు బాలును ఆసుపత్రిలో ఉంచుకుని, డబ్బుకోసమే చికిత్స చేశారంటూ ఎంజీఎం ఆసుపత్రిపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. దయచేసి ఇలాంటి రూమర్లను వ్యాపింపచేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు ఎంతో శ్రమించారని, తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థనలు కూడా చేశారని వెల్లడించారు. డబ్బు విషయంలో తమను వారు బాధించారనడం సబబు కాదని అన్నారు. తన తండ్రిని అభిమానించేవాళ్లు ఇలాంటి ప్రచారాలు చేయరని చరణ్ స్పష్టం చేశారు.
నాన్నను కోల్పోయి ఎంతో వేదనలో ఉన్న తమను ఇలాంటి ప్రచారాలు మరింత బాధిస్తాయన్న విషయం గుర్తెరగాలని సూచించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తమిళనాడు ప్రభుత్వం ప్రతిరోజూ తన తండ్రి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్న నేపథ్యంలో పుకార్లకు ఇది సమయం కాదని స్పష్టం చేశారు.