China: చైనా నుంచి మరో ముప్పు.. దాడికి సిద్ధంగా ‘క్యాట్ క్యూ వైరస్’: ఐసీఎంఆర్
- ఆందోళన కలిగిస్తున్న ‘క్యాట్ క్యూ వైరస్’
- పందులు, క్యూలెక్స్ జాతి దోమలను వాహకాలుగా మార్చుకుంటున్న వైరస్
- ఫెబ్రైల్ ఆరోగ్య సమస్యలు ప్రబలే అవకాశం
చైనా నుంచి భారత్‌కు మరో ముప్పు పొంచి ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరించింది. ‘క్యాట్ క్యూ వైరస్’ (సీక్యూవీ) దాడికి సిద్ధంగా ఉందని పేర్కొంది. క్యూలెక్స్ జాతి దోమలు, పందులను ఈ వైరస్ వాహకాలుగా మార్చుకుంటుందని చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇప్పటికే వెల్లడైంది. భారత్‌లోనూ పందుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. ఏజిప్టీతోపాటు క్యూలెక్స్ జాతి దోమల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది.
దేశవ్యాప్తంగా 883 సీరం నమూనాలను సేకరించి వాటిని పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)లో పరీక్షించారు. ఈ సందర్భంగా రెండు నమూనాల్లో క్యాట్ క్యూ వైరస్‌ను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీల జాడను గుర్తించారు. ఈ వైరస్ ప్రస్తుతం ఎంతమందిలో ఉన్నదీ తెలియాలంటే మరిన్ని నమూనాలను పరీక్షించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్ వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ఫెబ్రైల్ ఆరోగ్య సమస్యలు ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు. మనుషులతోపాటు పందులు, ఇతర జంతువుల నుంచి కూడా శాంపిళ్లను సేకరిస్తామని తెలిపారు.