Brahmos: లాంగ్ రేంజి క్షిపణులను సరిహద్దులకు తరలించిన చైనా... ప్రతిగా బ్రహ్మోస్ క్షిపణులను మోహరించిన భారత్
- సరిహద్దుల్లో ఉద్రిక్తతలు
- పోటాపోటీగా ఆయుధ మోహరింపులు
- చైనాకు దీటుగా వ్యవహరిస్తున్న భారత్
భారత్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో తొలగిపోయేట్టు కనిపించడంలేదు. గాల్వన్ లోయ ఘర్షణలతో ఇరు దేశాల బలగాల మధ్య తీవ్ర వైరం నెలకొంది. పోటాపోటీ మోహరింపులతో ఎల్ఏసీ పొడవునా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. తాజాగా చైనా తన లాంగ్ రేంజి క్షిపణులను అక్సాయ్ చిన్, కస్ఘర్, లాసా, నింగ్జి, హోటన్ వంటి ప్రాంతాలకు తరలించగా, భారత్ అందుకు దీటైన రీతిలో సన్నద్ధమైంది. బ్రహ్మోస్ వంటి తిరుగులేని క్షిపణిని మోహరించింది.
బ్రహ్మోస్ తో పాటు నిర్భయ్, ఆకాశ్ వంటి సమర్థవంతమైన అస్త్రాలను కూడా రంగంలోకి దింపింది. 500 కిమీ రేంజ్ ఉన్న బ్రహ్మోస్ జిన్ జియాంగ్, టిబెట్ లో ఉన్న చైనా వాయుసేన స్థావరాలను తుత్తునియలు చేయగలదు. సూపర్ సోనిక్ వేగంతో పయనించే బ్రహ్మోస్ క్షిపణిని యుద్ధ విమానం నుంచే కాదు, భూతల కేంద్రం నుంచి కూడా దీన్ని ప్రయోగించే వీలుంది.
ఇక ఆకాశ్ క్షిపణి గురించి చెప్పుకోవాల్సి వస్తే దీనిలోని రాడార్ ఎంతో ప్రత్యేకమైంది. ఏకకాలంలో 64 లక్ష్యాలను గుర్తించి, అందులోని 12 లక్ష్యాలను ఎంపిక చేసుకుని దూసుకుపోతుంది. ఇది శత్రు దేశాల యుద్ధ విమానాలనే కాదు క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను కూడా గాల్లోనే ధ్వంసం చేయగలదు.
నిర్భయ్ మిస్సైల్ ను భూతలం నుంచి భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు వినియోగిస్తారు. దీని రేంజ్ 800 కిమీ వరకు ఉంటుంది.