Devineni Uma: కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్ పై ముందే కొందరి కన్ను పడింది: దేవినేని ఉమ
- కాకినాడ సెజ్ నుంచి తప్పుకుంటేనే భోగాపురం ఎయిర్ పోర్టా?
- వాటాల బదలాయింపు వెనక మతలబు ఏంటి?
- నాడు 108, 104ల కాంట్రాక్టు
- నేడు సెజ్, పోర్టుల బదలాయింపు డీల్
పదివేల ఎకరాల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద సెజ్ అయిన కాకినాడ సెజ్‌లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేసిన టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీ సర్కారుపై మండిపడ్డారు.
'కాకినాడ సెజ్ నుంచి తప్పుకుంటేనే భోగాపురం ఎయిర్ పోర్టా? వాటాల బదలాయింపు వెనక మతలబు ఏంటి? బల్క్ డ్రగ్ పార్క్ పై ముందేకన్ను. నాడు 108, 104ల కాంట్రాక్టు.. నేడు సెజ్, పోర్టుల బదలాయింపు డీల్, పోర్టు నిర్మాణం చేస్తామంటున్న ఫార్మాకంపెనీ ఎవరిది? కంపెనీ తరుపున డీల్ నడిపిన పెద్దలుఎవరు? చెప్పండి వైఎస్ జగన్' అని దేవినేని ఉమ నిలదీశారు.
కాగా, కాకినాడ సెజ్‌లో 51 శాతం వాటా జీఎంఆర్ సంస్థదేనని ఆంధ్రజ్యోతి దినపత్రికలో పేర్కొన్నారు. దీంతోపాటు కేసెజ్‌లో ఓడరేవు నిర్మాణంలో వందశాతం వాటా కూడా ఉందని పేర్కొన్నారు. దీని ద్వారా ఓడ రేవుల రంగంలో దూసుకుపోవాలని భావించిందని, అయితే, ఇటీవల అనూహ్యంగా ఓడరేవు అనుమతులతో సహా కాకినాడ సెజ్‌లో తనకున్న మొత్తం 51 శాతం వాటాను అరబిందో రియల్టీకి జీఎంఆర్ విక్రయించిందని అందులో చెప్పారు. దీనిపై కార్పొరేట్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందని తెలిపారు. జీఎంఆర్ వాటాలను అరబిందో దక్కించుకోవడం వెనుక చాలా వ్యూహముందనే అనుమానాలు వ్యక్తం చేశారు.