unlock 5: అన్ లాక్ 5... స్కూళ్లు, సినిమా థియేటర్ల ప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాలు!
- అక్టోబర్ 15 నుంచి విద్యాసంస్థలు తెరవడానికి అనుమతి
- విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి అవసరం
- 50 శాతం కెపాసిటీతో థియేటర్లు, మల్టీప్లెక్సులు
కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా కఠినమైన లాక్ డౌన్ ను అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం... ఆ తర్వాత నిబంధనలను క్రమంగా సడలిస్తూ వస్తోంది. ఇప్పటికే పలు కార్యకలాపాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా కాసేపటి క్రితం అన్ లాక్ 5ను కేంద్రం ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. అయితే దీనిపై ఆయా రాష్ట్రాలు, విద్యాసంస్థలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.
ఇదే సమయంలో ఆన్ లైన్, డిస్టెన్స్ విద్యకే ప్రాధాన్యతను ఇస్తున్నట్టు చెప్పింది. అయితే 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న విద్యార్థుల విషయంలో మాత్రం కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విద్యాసంస్థలు అనుమతి తీసుకోవాలని చెప్పింది. హాజరుకై పట్టుపట్టకూడదని కండిషన్ పెట్టింది.
ఇదే సమయంలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో వీటిని నిర్వహించాలని తెలిపింది. అయితే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం అక్టోబర్ 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని చెప్పింది.