Jagan: దశాబ్దకాలంగా మూతపడి ఉన్న బాపు మ్యూజియాన్ని ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
- పదేళ్ల కిందట మూతపడిన బాపు మ్యూజియం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మ్యూజియం ఆధునికీకరణ
- మ్యూజియంలో 1,500 పురాతన వస్తువులు
- ప్రాచీన వస్తువులను ఆసక్తిగా తిలకించిన సీఎం జగన్
విజయవాడలో దశాబ్దకాలంగా మూతపడిన బాపు మ్యూజియాన్ని సీఎం జగన్ ఇవాళ పునఃప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ మ్యూజియాన్ని రూ.8 కోట్లతో పునర్నిర్మించారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మ్యూజియాన్ని ఆధునికీకరించారు. పురాతన శిల్పకళతో మ్యూజియంను తీర్చిదిద్దారు. టెక్నాలజీ సాయంతో శిల్పకళ సంపద విశిష్టతను తెలిపేలా ఈ మ్యూజియంలో ఏర్పాట్లు చేశారు. మ్యూజియం ప్రారంభోత్సవం అనంతరం సీఎం జగన్ అందులోని చారిత్రక, పురాతన వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు.
ఈ మ్యూజియంలో మానవ చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే 1,500 అత్యంత ప్రాచీన వస్తువులను ఇందులో ప్రదర్శనకు ఉంచారు. ఆదిమానవుడు ఉపయోగించిన వస్తువుల నుంచి 19వ శతాబ్దం నాటి ఆధునిక మానవుడు ఉపయోగించిన వస్తువులను కూడా చూడొచ్చు. మధ్యయుగం నాటి మట్టితో తయారైన శవపేటిక ఇందులో ప్రధాన ఆకర్షణ.
బాపు మ్యూజియంలోని ప్రతి వస్తువు వద్ద ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి బాపు మ్యూజియం యాప్ ను ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ వస్తువు పూర్తి వివరాలు ఫోన్ లో ప్రత్యక్షమవుతాయి. పురావస్తు విభాగం కమిషనర్ వాణీ మోహన్ ఈ వివరాలను సీఎం జగన్ కు తెలిపారు.
ఈ మ్యూజియం ప్రారంభోత్సవంలో ఏపీ మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, పెద్దిరెడ్డి, కొడాలి నాని, అవంతి శ్రీనివాస్, పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. కాగా, మ్యూజియం ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. విక్టోరియా మహల్ లో మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.