Japan: ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిని హత్య చేస్తూ, సాయం చేస్తున్నట్టు భావన.. మరణశిక్ష విధించిన కోర్టు!
- సోషల్ మీడియా ద్వారా బాధితులతో పరిచయం
- 9 మందిని హత్య చేసిన హంతకుడు
- హత్య చేసి వారిని కష్టాల నుంచి కడతేరుస్తున్నట్టు భావన
పలు సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలని భావించే వారిని హత్య చేస్తూ వారిని ఆ కష్టాల నుంచి విముక్తి చేస్తున్నట్టు భావించే వ్యక్తికి జపాన్ కోర్టు మరణ దండన విధించింది. అతడు మొత్తం 9 మందిని హత్య చేయగా, వారిలో ఏడుగురు మహిళలు, 15 ఏళ్ల బాలిక, 20 ఏళ్ల యువకుడు ఉన్నారు. తకహిరో షిరైహి అనే వ్యక్తి ఈ వరుస హత్యలకు పాల్పడ్డాడు.
అతడి చేతిలో హత్యకు గురైన వారందరూ సోషల్ మీడియా ద్వారా అతడికి పరిచయం అయినవారే. వివిధ కారణాలతో ఆత్మహత్య ఎలా చేసుకోవాలో ఇంటర్నెట్‌లో వెతికే ఇటువంటి వారితో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకునేవాడు. వారి ఇబ్బందులను తెలుసుకున్న అనంతరం ఆత్మహత్యకు మరింతగా ప్రేరేపించేవాడు. అనంతరం హత్య చేసేవాడు.
చంపేసిన తర్వాత వారి శరీరాలను చిన్నచిన్న ముక్కలుగా చేసి ఐస్ బాక్స్‌లలో భద్రపరిచేవాడు. 2017లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అది చూసిన తకహిరో ఆమెతో మాట్లాడి పరిచయం పెంచుకున్నాడు. అనంతరం హత్య చేశాడు
ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకోగా ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. టోక్యో సమీపంలోని జామా నగరంలో అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు షాకయ్యారు. ఫ్లాట్ నిండా మృతదేహాలు ముక్కలు ముక్కలుగా కనిపించాయి. హంతకుడు తనపై నమోదైన అభియోగాలు నిజమేనని, హత్యలు చేసింది తానేనని అంగీకరించాడు. దీంతో అతడిని దోషిగా తేల్చిన కోర్టు మరణశిక్ష విధించింది.