Andhra Pradesh: ఎందుకిదంతా? విశ్వాసం లేకుంటే హైకోర్టును మూసేయమనండి: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

AP High court fires on state government Over Objectionable postings in social media

  • హైకోర్టును అపకీర్తి పాలు చేయాలనుకుంటారా?
  • సోషల్ మీడియా పోస్టుల వెనక ఉన్న కుట్రను తేలుస్తాం
  • చట్టబద్ధ పాలన అమలు కాకుంటే మా అధికారాన్ని వినియోగిస్తాం

హైకోర్టును అపకీర్తి పాలు చేసేలా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అభ్యంతరకర పోస్టులపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థపై నమ్మకం లేకుంటే ఏపీ హైకోర్టును మూసివేయాలని పార్లమెంటులో కోరాలని సూచించింది. ఎవరి ప్రభావమూ లేకుండా న్యాయమూర్తులను ఎవరూ ఊరకనే దూషించరని, ఈ పోస్టుల వెనక ఉన్న కుట్ర కోణాన్ని తేలుస్తామని హెచ్చరించింది.

 రాష్ట్రంలో చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా అమలు కాకపోతే తమకున్న ఇతర నిబంధనల ప్రకారం అధికారాన్ని వినియోగిస్తామని స్పష్టం చేసింది. న్యాయమూర్తులపై ఆరోపణల నేపథ్యంలో స్వయంగా హైకోర్టే వ్యాజ్యం దాఖలు చేయాల్సి వచ్చిందని తెలిపింది. కోర్టులు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పెట్టే పోస్టింగులను అనుమతించవద్దని సోషల్ మీడియా తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులకు  జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం సూచించింది.

గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులను తాము చూడలేదని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సజన్ పూవయ్యలు బదులిస్తూ న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సీఐడీ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌ను పరిశీలించే నిమిత్తం విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని, సీఐడీకి ఫిర్యాదు చేసినా వారిపై ఎటువంటి చర్యలు లేవంటూ హైకోర్టులో అప్పటి రిజస్ట్రార్ జనరల్ వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.

  • Loading...

More Telugu News