Nara Lokesh: సబ్బం హరి ఇంటి వద్ద ఉద్రిక్తతలపై నారా లోకేశ్ ఆగ్రహం
- వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలను హరి ఎండగడుతున్నారు
- నోటీసు కూడా ఇవ్వకుండా ఇంటిని కూల్చే కుట్ర
- ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారని బెదిరింపులు
- జగన్‌కు యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్టణానికి చెందిన తమ పార్టీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరికి చెందిన సీతమ్మధారలోని ఆయన ఇంటి ప్రహరీని కూల్చివేస్తుండడం పట్ల స్పందించారు. వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతున్నారన్న కోపంతోనే నోటీసు కూడా ఇవ్వకుండా సబ్బంహరి ఇంటిని కూల్చే కుట్ర చేశారని ఆయన అన్నారు.
ఉన్నత విలువలతో రాజకీయాల్లో సబ్బంహరి కొనసాగుతున్నారని, ఆయనపై కక్షసాధింపు చర్యలు జగన్‌ను మరింత దిగజార్చాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారని, విమర్శిస్తే భవనాలు కూల్చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు.
జగన్ తనలో ఉన్న సైకో మనస్తత్వాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆయన యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారని, ఈ వ్యాధి ప్రధాన లక్షణం విధ్వంసం సృష్టించడమేనని ఆయన చురకలంటించారు. విధ్వంసంతో ప్రజాగ్రహాన్ని అణిచివేయడం నియంతలకు సాధ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు.