IT Employee: హైదరాబాద్‌లో మరో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!
- నార్సింగి పీఎస్ పరిధిలో ఆత్మహత్య
- మృతురాలి భర్త కూడా ఐటీ ఉద్యోగే
- సూసైడ్ నోట్ లభించినట్టు సమాచారం
పని ఒత్తిడివల్లో లేక వ్యక్తిగత సమస్యలవల్లో కానీ ఆత్మహత్యలకు పాల్పడుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల సంఖ్య పెరుగుతోంది. మంచి ఉద్యోగం, జీతం అన్నీ ఉన్నా పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాదులో రమ్యకృష్ణ అనే ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని సామ్రాట్ అపార్ట్ మెంటులో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టారు.
వివాహిత అయిన ఆమెకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఆమె భర్త గోపి కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. జీవితం ఎంతో సాఫీగా సాగుతున్నప్పటికీ ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. భార్యాభర్తలు సంతోషంగా ఉండేవారని చుట్టుపక్కల వారు చెపుతున్నారు. ఘటనా స్థలికి చేసుకున్న పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.