Priyanka Gandhi: కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ పడకుండా... బారికేడ్ దూకి అడ్డు నిలిచిన ప్రియాంకా గాంధీ... వీడియో ఇదిగో!
- నీలి రంగు కుర్తా వేసుకుని హాత్రాస్ కు బయలుదేరిన ప్రియాంక
- పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడిన కార్యకర్త
- అతనికి రక్షణగా నిలిచిన కాంగ్రెన్ నాయకురాలు
తమను నమ్ముకుని, తమతో ప్రయాణిస్తూ, ఉత్తరప్రదేశ్ సరిహద్దులకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకోగా, వారిపై పోలీసు లాఠీ పడకుండా కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అడ్డు నిలిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. బారికేడ్ ను నెట్టుకుంటూ వచ్చిన ప్రియాంక, పోలీసు లాఠీని గట్టిగా పట్టుకుని, తమ పార్టీ కార్యకర్తను ఆమె కాపాడినట్టు కనిపిస్తోంది.
ఈ ఘటన డీఎన్డీ ఫ్లయ్ ఓవర్ నుంచి యూపీకి వెళుతున్న సమయంలో టోల్ ప్లాజా సమీపంలో జరిగింది. ముదురు నీలిరంగు కుర్తా ధరించిన ప్రియాంక, అప్పటికే గాయపడిన కార్యకర్తను కాపాడాలని నిర్ణయించుకుని, పోలీసులకు, అతనికి మధ్య వచ్చి నిలబడినట్టు తెలుస్తోంది. పోలీసులు అతన్ని నెట్టివేస్తుంటే, ప్రియాంక కల్పించుకున్నారు. ఆపై గాయపడ్డ అతన్ని రాహుల్ గాంధీతో కలిసి వెళ్లి పరామర్శించారు కూడా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు అడ్డుగా నిలిచిన వీడియోను మీరూ చూడవచ్చు.