Jagan: మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి
- విశాఖలో ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత
- ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని లోటు అని పేర్కొన్న సీఎం జగన్
- ఇటీవలే కరోనా బారినపడిన మాజీ ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (వీఎంఆర్ డీఏ) చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఈ సందర్భంగా ద్రోణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అటు, ఉత్తరాంధ్ర నేత గంటా శ్రీనివాసరావు కూడా ద్రోణంరాజు మృతిపై స్పందించారు. అత్యంత సౌమ్యుడు, మా మిత్రులు ద్రోణంరాజు శ్రీనివాస్ ఇక లేరన్న వార్త తీవ్రంగా కలచివేసింది అని ట్వీట్ చేశారు.
ద్రోణంరాజు శ్రీనివాస్ కొన్నివారాల కిందట కరోనా బారినపడ్డారు. ఆయన కరోనాను జయించినా, ఆ మహమ్మారి వైరస్ కలుగజేసిన నష్టాన్నుంచి తప్పించుకోలేకపోయారు. కీలక అవయవాలు దెబ్బతినడంతో ఆయన ఈ సాయంత్రం విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు.