Donald Trump: ముందు ప్రకటించిన దానికంటే ట్రంప్ పరిస్థితి క్షీణించింది... అందుకే ఆసుపత్రికి!: వైట్ హౌస్
- వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్
- జ్వరం, రక్తంలో తక్కువ ఆక్సిజన్ స్థాయితో బాధపడిన ట్రంప్
- వేగంగా కోలుకుంటున్నారన్న వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా సోకడంతో ఆసుపత్రి పాలయ్యారు. దీనిపై వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మీడోస్ స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్ కు కరోనా సోకిందని తొలుత అధికారులు ప్రకటించినా, ఆ తర్వాత ఆయన పరిస్థితి చాలా క్షీణించిందని మీడోస్ వెల్లడించారు. ట్రంప్ జ్వరంతో బాధపడుతుండడంతో పాటు, ఆయన రక్తంలో ఆక్సిజన్ స్థాయి వేగంగా పడిపోతుండడాన్ని గుర్తించిన వైద్యులు ఆసుపత్రిలో చేరాల్సిందిగా సూచించారని వివరించారు.
అయితే, ప్రస్తుతం ట్రంప్ కు జ్వరంలేదని, ఆక్సిజన్ స్థాయి కూడా ఎంతో ఆశాజనకంగా ఉందని, అన్నింటికంటే ఎంతో ఊరట కలిగించే అంశం ఇదేనని మీడోస్ తెలిపారు. "నిన్న ఉదయం మేమెంతో ఆందోళనకు గురయ్యాం. ఆయనకు తీవ్ర జ్వరం, పైగా రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అధ్యక్షుడు తనదైన శైలిలో లేచి తిరుగుతూనే ఉన్నారు. నిన్నటితో పోల్చితే ఇప్పుడాయన నమ్మశక్యం కాని రీతిలో కోలుకున్నారు" అంటూ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ట్రంప్ వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా వాల్టర్ రీడ్ ఆసుపత్రి డాక్టర్లు ట్రంప్ ఆరోగ్యంపై అప్ డేట్స్ వెల్లడించారు. ఆయన మునుపటితో పోల్చితే ఆరోగ్యంగా ఉన్నారని, క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. ట్రంప్ ఆసుపత్రిలో చేరే నాటికి జ్వరంతో బాధపడుతున్నారని, ఆయన రక్తంలో ఆక్సిజన్ స్థాయి 94 కంటే తక్కువగా ఉందని, ఇప్పుడది 95 కంటే ఎక్కువగా ఉందని, ఇది శుభపరిణామం అని పేర్కొన్నారు. అధ్యక్షుడ్ని రేపు డిశ్చార్జి చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.