New Delhi: అక్టోబర్ 31 వరకూ స్కూళ్ల మూసివేత కొనసాగుతుంది: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా
- సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం
- ఆపై పరిస్థితిని బట్టి నిర్ణయం
- చిన్నారుల ఆరోగ్యంతో రిస్క్ చేయలేమన్న ఢిల్లీ సర్కారు
కరోనా తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా, దేశ రాజధాని న్యూఢిల్లీ పరిధిలో ఇప్పట్లో స్కూళ్లు తెరచుకునే అవకాశాలు లేవు. అన్ లాక్ 5.0లో భాగంగా పాఠశాలలు తిరిగి తెరచుకునేందుకు అనుమతి లభించినా, అక్టోబర్ 31 వరకూ స్కూళ్ల మూసివేత కొనసాగుతుందని, ఆపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు. ఈ విషయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
వాస్తవానికి ఈ నెల 5 నుంచి స్కూళ్లను తిరిగి తెరవాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పట్లో స్కూళ్లు తెరవద్దని, ఆన్ లైన్ క్లాసులు మాత్రం నిర్వహించుకోవచ్చని అన్నారు. "నేనూ ఓ తండ్రినే. పరిస్థితి ఎంత తీవ్రతగా ఉందో అర్థం చేసుకోగలను. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చిన్నారుల ఆరోగ్యంతో రిస్క్ చేయడం సరైన చర్య కాదు" అని అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారని, తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు.
కాగా, స్కూళ్లు తెరచినా, విద్యార్థుల అటెండెన్స్ తప్పనిసరి కాదని, తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక అనుమతిని తీసుకున్న తరువాత మాత్రమే పాఠశాలలకు పిల్లలను అనుమతించాలని కేంద్రం, తన అన్ లాక్ 5.0 మార్గదర్శకాల విడుదల సందర్భంగా స్పష్టం చేసింది. ఇప్పటికీ వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడంతో స్కూళ్లు తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయన్న విషయమై సందిగ్ధత నెలకొని వుంది. మార్చిలో లాక్ డౌన్ ను ప్రకటించిన తరువాత మూతబడిన స్కూళ్లు ఇప్పటివరకూ తెరచుకోలేదు. 9వ తరగతిపై క్లాసుల వారికి మాత్రం కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు తిరిగి తెరచుకున్నాయి.