AP High Court: రాజధాని తరలింపు అంశంలో మధ్యంతర ఉత్తర్వుల పిటిషన్లపై ముందుగా విచారణ
- రాజధాని తరలింపు అంశంపై 229 పిటిషన్లు
- రేపటినుంచి హైకోర్టులో రోజువారీ విచారణ
- ఆన్ లైన్ లో విచారణ
ఏపీ రాజధాని తరలింపు అంశంపై హైకోర్టులో రేపటి నుంచి రోజువారీ విచారణ చేపట్టనున్నారు. రాజధాని మార్పు అంశంపై ఇప్పటివరకు 229 అనుబంధ పిటిషన్లు రావడంతో, వాటిని అంశాల వారీగా విభజించి విచారణ చేపట్టాలని హైకోర్టు భావిస్తోంది. ఈ పిటిషన్లను అంశాల వారీ ప్రాతిపదికన ప్రతిరోజు విచారణ చేపడతామని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ రాకేశ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
అయితే, రాజధాని తరలింపుపై మధ్యంతర ఉత్తర్వులు కోరుతూ దాఖలైన పిటిషన్లపై ముందుగా విచారణ చేపడతారని న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. మరో న్యాయవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రాజధాని అంశంలో గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగుతాయని వివరించారు. కాగా, తాజా విచారణ ప్రక్రియ ఆన్ లైన్ విధానంలో సాగుతుందని, కీలక పత్రాలు పరిశీలన చేయాల్సి వచ్చినప్పుడు ప్రత్యక్ష విధానంలో విచారణ చేపట్టే అవకాశముందని లక్ష్మీనారాయణ తెలిపారు.
అమరావతి రాజధాని తరలింపు నేపథ్యంలో రైతులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు ఎంతోమంది హైకోర్టును ఆశ్రయించడంతో భారీగా పిటిషన్లు వచ్చిపడ్డాయి. వీటిని ఒకేసారి విచారించడం కష్టమని భావించిన హైకోర్టు, అంశాల వారీ ప్రాతిపదికన విచారించాలని నిర్ణయించింది.