Devineni Uma: అందుకే ఆ సమావేశాల వివరాలను జగన్ ధైర్యంగా వెల్లడించలేరు: దేవినేని ఉమ
- పట్టాభిని పరామర్శించిన ఉమ, అర్జునుడు
- ఉక్రోషంతోనే దాడులు చేస్తున్నారని వ్యాఖ్యలు
- మంత్రిపదవుల బేరానికి జగన్ ఢిల్లీ వెళ్లారన్న ఉమ
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను పార్టీ సహచరులు దేవినేని ఉమ, బచ్చుల అర్జునుడు పరామర్శించారు. పట్టాభి కారును కొందరు దుండగులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టాభిని పరామర్శించిన సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ, ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నారనే పట్టాభి కారుపై దాడి చేశారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న ఉక్రోషంతోనే దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. పులివెందుల పంచాయితీలను రాష్ట్రమంతా విస్తరింపజేస్తున్నారని, సీఎం జగన్ ఏపీకి బీహార్ సంస్కృతిని తీసుకొచ్చారని ఉమ మండిపడ్డారు.
ఏపీ రైతులు టీషర్టులు ధరించడాన్ని ప్రశ్నించిన ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పైనా ఉమ విమర్శలు చేశారు. అమరావతి రైతులను తిట్టడానికి మంత్రికి సిగ్గుండాలని అన్నారు. ఏం రైతులు అయినంత మాత్రాన టీ షర్టులు వేసుకోకూడదా? విమానాలు ఎక్కకూడదా? అని ప్రశ్నించారు. అమరావతిని చంపేయాలనే కుట్రతోనే ముంపు ప్రాంతమంటూ డ్రామాలు ఆడుతున్నారని, చంద్రబాబు నివాసానికి నోటీసులు అంటించి రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనిలోపనిగా జగన్ ఢిల్లీ టూర్ పైనా ఉమ స్పందించారు. కేంద్ర మంత్రి పదవుల బేరం కోసం జగన్ ఢిల్లీ వెళ్లారేమో అని అన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారని, ఆ తర్వాత కేంద్రానికి మన అవసరం లేదని చెప్పి చేతులెత్తేశారని విమర్శించారు. నమ్మి గెలిపించిన ప్రజలకు నమ్మకద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. కేంద్రంతో వ్యక్తిగత పనులు, కేసుల గురించే జగన్ చర్చిస్తారని పేర్కొన్నారు. అందుకే, ఢిల్లీ పెద్దలతో సమావేశం వివరాలు వెల్లడించే ధైర్యం జగన్ కు లేదని ఎద్దేవా చేశారు.