Somu Veerraju: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వారే నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్నారు: సోము వీర్రాజు
- రేపు అపెక్స్ కౌన్సిల్ సమావేశం
- కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసిన సోము వీర్రాజు
- రాయలసీమకు నీటి కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం రేపు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాశారు. రాయలసీమ ప్రాజెక్టులపై నెలకొన్న వివాదం పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ భేటీలో చర్చించాలని సూచించారు.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటిపారుదల మంత్రులుగా తెలంగాణ వారే వ్యవహరించారని, ఆ సమయంలో తెలంగాణ ప్రాజెక్టులకు అప్పటి సీఎంలు, మంత్రులు సహకరించారని తెలిపారు. ఆ తర్వాత ప్రత్యేక ఉద్యమ సమయంలో నీటివనరులపై కేసీఆర్ ఎంతో అవగాహన పెంచుకున్నారని వివరించారు. ఇక, రాష్ట్ర విభజన జరిగిన అనంతరం తెలంగాణలో అనేక ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. ఆ సమయంలో సీఎం చంద్రబాబు, విపక్షనేత జగన్ ఎవరూ అభ్యంతరం చెప్పలేదని సోము వీర్రాజు తన లేఖలో తెలిపారు.
ఏపీ అభివృద్ధిలో రాయలసీమ ప్రాంతం కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో సాగునీరు లేకుంటే అద్భుతమైన ధాన్యాగారాన్ని కోల్పోతామని వివరించారు. అందుకే రాయలసీమలో సాగు, ఉపాధి అవకాశాలు పెంపొందేలా నీటి కేటాయింపులు చేయాలని, ఎవరికీ నష్టం లేని రీతిలో నిర్ణయం తీసుకోవాలని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.