Supreme Court: ధర్నాలు ప్రజలకు ఇబ్బందికరంగా మారితే చర్యలు తీసుకునేందుకు మా అనుమతి అక్కర్లేదు: సుప్రీం స్పష్టీకరణ
- ఢిల్లీ షహీన్ బాగ్ నిరసనల పిటిషన్ పై సుప్రీంలో విచారణ
- ధర్నాలు, నిరసనలపై సుప్రీం మార్గదర్శకాలు
- ధర్నాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని హితవు
ధర్నాలు, నిరసన ప్రదర్శనలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వెల్లడించింది. ధర్నాలు, నిరసనల పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టేవారిపై చర్యలు తీసుకునేందుకు తమ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఢిల్లీ షహీన్ బాగ్ నిరసనలకు సంబంధించిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం తాజా వ్యాఖ్యలు చేసింది. ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు ప్రజలకు అసౌకర్యంగా కలిగించేవిగా ఉండరాదని పేర్కొంది. బహిరంగ ప్రదేశాలలో ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందిపెట్టడం సరైన విధానం కాదని వివరించింది.
నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే, ఆ హక్కు ఇతరులకు భంగం కలిగించేలా పరిణమించరాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా, రోడ్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించరాదని, అలాంటి పరిస్థితుల్లో ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించే హక్కు ప్రభుత్వాలకు ఉంటుందని వివరించింది.