Uttar Pradesh: జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు వేసిన ఎత్తుగడ విఫలం.. మళ్లీ కటకటాల పాలు!

Man killed another person to fake his own death

  • తాను చనిపోయినట్టు నమ్మించేందుకు వ్యక్తి హత్య
  • ముఖాన్ని గుర్తుపట్టని విధంగా ఛిద్రం చేసిన నిందితుడు
  • సహకరించిన భార్య, బంధువులు కూడా జైలు పాలు

బెయిలుపై బయటకు వచ్చిన వ్యక్తి జైలు శిక్షను తప్పించుకునేందుకు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. దీంతో అతడు మరోమారు కటకటాలపాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన మీరట్‌కు చెందిన రాజ్‌కుమార్ ఇటీవల బెయిలుపై బయటకు వచ్చాడు.

మళ్లీ జైలుకు వెళ్లకుండా శిక్ష నుంచి తప్పించుకునేందుకు పథకం రచించాడు. ఇందులో భాగంగా తన ఇంటికి సమీపంలో ఉండే మద్యం దుకాణానికి వెళ్లాడు. అక్కడ మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి కొంత డబ్బులతోపాటు తన దుస్తులు ఇచ్చాడు. అనంతరం తన భార్య, బంధువు సాయంతో మద్యం మత్తులో ఉన్న అతడిని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు.

చనిపోయింది తనేనని నమ్మించేందుకు అతడి ముఖాన్ని గుర్తుపట్టని విధంగా ఛిద్రం చేశాడు. తన ఆధార్ కార్డును మృతదేహం వద్ద పడేశాడు. గత నెల 23న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆధారాల కోసం ఆ ప్రాంతాన్ని గాలిస్తుండగా రాజ్‌కుమార్ ఆధార్ కార్డు లభ్యమైంది. దీంతో మృతదేహం ముఖాన్ని పరిశీలించగా ఆనవాళ్లు కనిపించకపోవడంతో పోలీసుల అనుమానం రాజ్‌కుమార్ వైపు మళ్లింది. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.

కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు రాజ్‌కుమార్ భార్య నుంచి అతడి ఫోన్ నంబరు తీసుకున్నారు. దానికి ఫోన్ చేయగా అది అలీగఢ్ ప్రాంతంలోని ఓ మొబైల్ దుకాణంలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి వెళ్లిన పోలీసులు మొబైల్ షాపు యజమానికి రాజ్‌కుమార్ ఫొటో చూపించారు. అది చూసిన యజమాని అతడే తనకు ఈ ఫోన్‌ను విక్రయించినట్టు చెప్పడంతో చిక్కుముడి వీడిపోయింది. రాజ్‌కుమార్ భార్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ఆమె గుట్టు విప్పింది. రాజ్‌కుమార్‌తోపాటు అతడికి సహకరించిన భార్య, సమీప బంధువును కూడా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.

  • Loading...

More Telugu News