Harish Rao: ఉత్తమ్ కుమార్ రెడ్డి సూట్ కేసు తీసుకుని వచ్చారు: హరీశ్ రావు
- ఎన్నికల సమయంలోనే ఉత్తమ్ కు ప్రజలు గుర్తుకొస్తారు
- మా నాన్నకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని శ్రీనివాస్ రెడ్డి గతంలో చెప్పారు
- ఇప్పుడు ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావు?
దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి వచ్చిన చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో విమర్శల తీవ్రత కూడా పెరుగుతోంది. మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రజలు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో సూట్ కేసు తీసుకుని వచ్చారని అన్నారు.
మా నాన్న చెరుకు ముత్యంరెడ్డికి కాంగ్రెస్ వాళ్లు అన్యాయం చేశారని గతంలో శ్రీనివాస్ రెడ్డి అన్నారని హరీశ్ చెప్పారు. మా నాన్న ఆత్మ ఏడుస్తోందని బాధ పడ్డ నీవు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరావని ప్రశ్నించారు. ఊసరవెల్లిలా పార్టీలు మారావని మండిపడ్డారు. కేసీఆర్ ను మించిన నాయకుడు లేరని మీ నాన్న అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు జనాల్లోకి వచ్చి ఓట్లు ఎలా అడుగుతావని ప్రశ్నించారు. పని చేసేవాళ్లని తిట్టడం తప్ప కాంగ్రెస్ నాయకులకు ఏమీ తెలియదని అన్నారు. జనాలకు ఏం చేస్తారో కూడా చెప్పరని విమర్శించారు.