David Warner: హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఖాతాలో అరుదైన రికార్డు

Hyderabad captain David Warner creates New record in IPL

  • ఐపీఎల్‌లో 50 సార్లు 50కిపైగా స్కోర్లు
  • ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు
  • వార్నర్ తర్వాతి స్థానంలో కోహ్లీ

సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 50 సార్లు 50కిపైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. గత రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ 40 బంతుల్లో 5 ఫోర్లు,  సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

2009 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న వార్నర్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మూడు సీజన్లలో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా 2018లో సీజన్‌లో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. నిషేధం పూర్తికావడంతో గతేడాది మళ్లీ జట్టులో చేరాడు. గత సీజన్‌లో 12 మ్యాచుల్లో 692 పరుగులు చేసి మూడోసారి ఆరెంజ్ క్యాప్‌ అందుకున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో వార్నర్ చేసిన అర్ధ సెంచరీతో 50సార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

పంజాబ్‌పై వార్నర్‌కు ఇది 9వ అర్ధ సెంచరీ కావడం గమనార్హం. వార్నర్ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 46 అర్ధ సెంచరీలు నమోదు చేయగా, నాలుగు సెంచరీలు ఉన్నాయి. వార్నర్ తర్వాత ఈ జాబితాలో బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 42సార్లు 50కిపైగా పరుగులు చేశాడు. రోహిత్ శర్మ, సురేశ్ రైనాలు 39 సార్లు ఈ ఘనత సాధించగా, డివిలియర్స్ 38సార్లు 50కిపైగా పరుగులు చేసి ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News