Devineni Uma: ఈ డీల్ వ్యవహారాలన్నీ నడుపుతున్న పెద్దలెవరు?: దేవినేని ఉమ
- విశాఖ బేపార్క్ అస్మదీయ కంపెనీకి సబ్ లీజ్
- పర్యాటక శాఖ నిబంధనలకు విరుద్ధంగా లీజ్ మార్చేయత్నం
- సొంతం చేసుకోవడానికి ఎందుకు తొందరపడుతున్నారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఫైనల్ బేరం పేరిట విశాఖలోని ‘బే పార్కు’ గురించి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు.
దాన్ని అధికారికంగా హస్తగతం చేసుకోవడానికి పెద్దలు తొందర పడుతున్నారని అందులో పేర్కొన్నారు.పాత ఇండో అమెరికన్ ప్రైవేటు హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బేపార్కు) నుంచి కొత్త కంపెనీ పేరు మీదకి లీజు మార్చేందుకు డాక్యుమెంట్లను సిద్ధం చేశారని అందులో ఉంది. వాటిని మూడురోజుల క్రితం రిజిస్ట్రేషన్ల శాఖకు సమర్పించినట్టు విశ్వసనీయంగా తెలిసిందని పేర్కొన్నారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.
చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసిన విశాఖ బేపార్క్ అస్మదీయ కంపెనీకి సబ్ లీజ్. పర్యాటక శాఖ నిబంధనలకు విరుద్ధంగా లీజ్ మార్చేందుకు రిజిస్ట్రేషన్ శాఖకు సమర్పణ. బేపార్కును అధికారికంగా సొంతం చేసుకోవడానికి పెద్దలు ఎందుకు తొందరపడుతున్నారు? డీల్ వ్యవహారాలన్నీ అమరావతి స్థాయిలో నడుపుతున్న పెద్దలు ఎవరు? అని దేవినేని ఉమ నిలదీశారు.