Smriti Irani: ఈ విషయాన్ని రాహుల్ కు చెప్పడానికి కాంగ్రెస్ నేతలకు ధైర్యం లేదు: స్మృతి ఇరానీ ఎద్దేవా
- మోదీని ఎద్దేవా చేస్తూ ఇటీవల రాహుల్ వ్యాఖ్యలు
- రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొడుతున్న స్మృతి ఇరానీ
- కాంగ్రెస్ నేతలు తమకున్న అజ్ఞానాన్ని వరంగా చెప్పుకుంటున్నారు
- రాహుల్ కి చెప్పడానికి ఎవరికీ ధైర్యం లేదు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు తమకున్న అజ్ఞానాన్ని వరంగా చెప్పుకుంటారని ఆమె అన్నారు.
అజ్ఞానాన్ని నిలబెట్టుకోవడానికి దేశ రాజకీయాల్లో ఓ వ్యక్తి ప్రయత్నం చేశారని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రమాదం ఇదేనంటూ ఆమె విమర్శించారు. ఈ విషయాన్ని ఆ యువరాజ్‌కు (రాహుల్ గాంధీ)కి చెప్పడానికి ఎవరికీ ధైర్యం లేదని ఆమె అన్నారు.
కాగా, టర్బైన్ల తయారీ సంస్థ వెస్తాస్ ప్రెసిడెంట్ హెన్రిక్ అండర్సన్‌తో ఇటీవల ప్రధానమంత్రి మోదీ చర్చించారు. ఆ సమయంలో వారి వీడియో ఒకటి బయటకు వచ్చింది. టర్బైన్లు గాల్లోని తేమను తీసుకుంటాయని, దీంతో ఎనర్జీతో పాటు తాగునీరు కూడా లభ్యమవుతుందని వారు మాట్లాడుకున్నారు.
దాని నుంచే ఆక్సిజన్‌ను కూడా వేరు చేస్తే ఒకేసారి తాగునీరు, ఎనర్జీ, ఆక్సిజన్ కూడా లభ్యమవుతాయని మోదీ వ్యాఖ్యానించినట్లు అందులో ఉంది. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. మోదీ అర్థం కాకపోవడం అసలైన ప్రమాదం కాదని, ఆ విషయం చెప్పడానికి ఆయన చుట్టూ ఉన్నవారికి ధైర్యం లేదని అన్నారు.
ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తిప్పికొడుతూ కేంద్ర మంత్రులు వరుసగా మాట్లాడుతున్నారు. ప్రపంచ స్థాయి సంస్థ ప్రధాని ఆలోచనను ప్రశంసించిందని, రాహుల్ మాత్రం అపహాస్యం చేస్తున్నారని స్మృతి ఇరానీ చెప్పారు.