laxmi parvati: తనపై కేసును ఉపసంహరించుకోవాలని గతంలో చంద్రబాబు నాపై ఒత్తిడి తెచ్చారు: లక్ష్మీ పార్వతి
- చంద్రబాబును జైలుకు పంపేవరకు పోరాడతా
- ఏసీబీ కోర్టులో న్యాయం జరక్కపోతే హైకోర్టుకు వెళతా
- చివరికి సుప్రీంకోర్టునూ ఆశ్రయిస్తానన్న లక్ష్మీపార్వతి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తెలుగు అకాడమీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబును జైలుకు పంపేవరకు తాను పోరాడుతూనే ఉంటానని తెలిపారు.
న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, ఏసీబీ కోర్టులో న్యాయం జరక్కపోతే హైకోర్టుకు వెళతానని తెలిపారు. ఒకవేళ అక్కడ కూడా న్యాయం దొరకకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. గతంలో కోర్టులో కేసును ఉపసంహరించుకోవాలని చంద్రబాబు తనకు ఫోన్ చేసి ఒత్తిడి చేశారని ఆమె వ్యాఖ్యానించారు.
కాగా, చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్పై హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని, విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని లక్ష్మీ పార్వతి పిటిషన్లో పేర్కొన్నారు. 2004 ఎన్నికల అఫిడవిట్లో ఆయన చూపిన ఆస్తులు, అనంతరం పెరిగిన ఆస్తులను చూపుతూ ఆమె గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ 21కి వాయిదా పడింది.