IPL 2020: ఐపీఎల్ 2020: కొనసాగుతున్న ఢిల్లీ విజయ ప్రస్థానం.. చిత్తుగా ఓడిన రాజస్థాన్
- వరుసగా నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ పరాజయం
- హ్యాట్రిక్ విజయాలతో అగ్రస్థానంలో ఢిల్లీ
- పొదుపుగా బౌలింగ్ చేసిన అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’
ఐపీఎల్లో ఢిల్లీ కేపిటల్స్ విజయ ప్రస్థానం కొనసాగుతోంది. నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టాపార్డర్ రాణించకపోయినా స్టోయినిస్ (39, 30 బంతుల్లో 4 సిక్సర్లతో), హెట్మయర్ (45, 24 బంతుల్లో ఫోర్, 5 సిక్సర్లతో) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోరు చేసింది. పృథ్వీషా 19, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 22, హర్షల్ పటేల్ 16, అక్సర్ పటేల్ 17 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా, కార్తీక్ త్యాగి, అండ్రూ టై, రాహుల్ తెవాటియాలు చెరో వికెట్ తీశారు.
అనంతరం 185 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేదు. వికెట్లను వరుసగా చేజార్చుకుంటూ ఓటమిని కొనితెచ్చుకుంది. యశస్వి జైశ్వాల్ (34, 36 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో), కెప్టెన్ స్మిత్ (24, 17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో), రాహుల్ తెవాటియా (38, 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో) మాత్రమే పరవాలేదనిపించారు.
వీరి తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోరు జోస్ బట్లర్ చేసిన 13 పరుగులే కావడం గమనార్హం. ఏకంగా ఏడుగురు ఆటగాళ్లు పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. ఫలితంగా మరో 2 బంతులు మిగిలి ఉండగానే 138 పరుగులకు రాజస్థాన్ ఆలౌట్ అయింది. రాజస్థాన్‌కు ఇది వరుసగా నాలుగో పరాజయం కాగా, ఢిల్లీకి హ్యాట్రిక్ విజయం.
ఢిల్లీ బౌలర్లలో రబడ మూడు వికెట్లు తీసుకోగా, అశ్విన్, స్టోయినిస్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అన్రిక్, హర్షల్ పటేల్, అక్సర్ పటేల్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించిన ఢిల్లీ 10 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పొదుపుగా బౌలింగ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.