Rajasthan: సజీవ దహనానికి గురైన పురోహితుడి అంత్యక్రియలు పూర్తి
- రాజస్థాన్ లో ని కరౌలి జిల్లాలో దారుణం
- స్థల వివాదం నేపథ్యంలో పురోహితుడిని సజీవ దహనం చేసిన వైనం
- కుటుంబసభ్యులు అంగీకరించడంతో అంత్యక్రియలు పూర్తి
స్థల వివాదం నేపథ్యంలో రాజస్థాన్ కు చెందిన ఒక పురోహితుడిని కొందరు వ్యక్తులు గురువారం సాయంత్రం సజీవదహనం చేశారు. ఆయన కుటుంబసభ్యులు చివరకు అంగీకరించడంతో కాసేపటి క్రితం అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
రూ. 50 లక్షల పరిహారంతో పాటు, కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తేనే అంత్యక్రియలకు ఒప్పుకుంటామని కుటుంబసభ్యులు పట్టుబట్టడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం కరౌలి జిల్లా సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ ఓం ప్రకాశ్ మీనా ఆగమేఘాల మీద మృతుడి గ్రామానికి వెళ్లారు. పురోహితుడు చనిపోయి ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయిన నేపథ్యంలో, వెంటనే అంత్యక్రియలను నిర్వహించేందుకు కుటుంబసభ్యులు అంగీకరించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో, కుటుంబసభ్యులు తమ నిరసనను ఆపేయడంతో అంత్యక్రియలను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా పురోహితుడి బంధువులు మాట్లాడుతూ, నిందితులందరినీ అరెస్ట్ చేయాలని... నిందితులకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారి, పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు.