KCR: ఎర్రవెల్లిలో సీఎం కేసీఆర్ నివాసం వివరాలు ధరణి యాప్ లో నమోదు
- స్థిరాస్తుల నమోదు కోసం ధరణి యాప్
- సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లిన గ్రామ కార్యదర్శి
- ప్రజలందరూ తమ ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవాలన్న సీఎం
స్థిరాస్తుల నమోదు కోసం ఉద్దేశించిన ధరణి యాప్ లో ఇవాళ సీఎం కేసీఆర్ నివాసం వివరాలు కూడా నమోదు చేశారు. సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన గ్రామ కార్యదర్శి, ఇతర అధికారులు వివరాలను ధరణి యాప్ లో అప్ లోడ్ చేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆస్తులపై ప్రజలకు సంపూర్ణ హక్కు, ఆస్తుల పట్ల భద్రత కల్పించే ఉద్దేశంతోనే ధరణి యాప్ తీసుకువచ్చామని వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా తామే స్థిరాస్తి నమోదు ప్రక్రియ చేపట్టామని, ఇది చారిత్రాత్మక విధానం అని అన్నారు. ప్రజలంతా తమ ఆస్తుల వివరాలను ఇందులో నమోదు చేసుకోవాలని సూచించారు.
కాగా, ధరణి పోర్టల్ ను దసరా (అక్టోబరు 25) నాడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ధరణి పోర్టల్ ప్రారంభానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా భూముల విలువ ఖరారు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.