Revanth Reddy: హరీశ్ రావు పరిస్థితి తీసేసిన తహసీల్దార్ మాదిరి తయారైంది: రేవంత్ రెడ్డి
- తోట కమలాకర్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీలో చేరాలని సూచన
- కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం చెబుదామని పిలుపు
సిద్ధిపేటలో ఈ రోజు తోట కమలాకర్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయనను ఇటీవలే బీజేపీ నుంచి బహిష్కరించారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా కమలాకర్ కు రేవంత్ సూచించారు.
భేటీ అనంతరం మీడియాతో రేవంత్ మాట్లాడుతూ, నిబద్ధత కలిగిన నేత కమలాకర్ అని కితాబిచ్చారు. నిరంతరం టీఆర్ఎస్ పై పోరాటం చేస్తూనే ఉన్నారని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ జెండాను మోసిన నాయకుడిని కాదని... ఒకే వ్యక్తికి మూడోసారి అవకాశం ఇచ్చారని విమర్శించారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే యువ నాయకులు అవసరమని, అందుకే కాంగ్రెస్ లో చేరాలని కమలాకర్ ను అడిగానని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని హామీలను తుంగలో తొక్కారని రేవంత్ మండిపడ్డారు. ఉద్యమకారులకు అన్యాయం చేసి... దుర్మార్గులకు మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. అందరం ఏకమై కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం చెపుదామని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ లో హరీశ్ రావు పరిస్థితి తీసేసిన తహసీల్దార్ మాదిరి తయారైందని ఎద్దేవా చేశారు.