Tanishq: ఎందుకొచ్చిన గొడవని... వివాదాస్పద యాడ్ ను తొలగించిన తనిష్క్!

Tanishq new ad raises fury in social media
  • తనిష్క్ పై నెటిజన్ల ఆగ్రహం
  • లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా యాడ్ ఉందంటున్న నెటిజన్లు
  • బాయ్ కాట్ తనిష్క్ అంటూ ప్రచారం
తనిష్క్... దేశంలోని ప్రముఖ ఆభరణాల సంస్థల్లో ఒకటి. ఇటీవల తనిష్క్ 'ఏకత్వం' పేరిట కొత్త నగల కలెక్షన్ తీసుకువచ్చింది. అయితే, ఈ 'ఏకత్వం' కలెక్షన్ ను ప్రచారం చేసేందుకు రూపొందించిన వాణిజ్య ప్రకటన వివాదాస్పమైంది. ఇది లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉందంటూ సోషల్ మీడియాలో దుమారం రేగింది. దాంతో వెనక్కి తగ్గిన తనిష్క్ తన యాడ్ ను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించింది.

ఇంతకీ ఆ యాడ్ లో ఏముందంటే... ఓ ముస్లిం కుటుంబం తమ ఇంటికి ఓ హిందూ యువతిని కోడలిగా ఆహ్వానిస్తుంది. ఆ హిందూ యువతికి హిందూ సంప్రదాయం ప్రకారమే సీమంతం నిర్వహిస్తారు. ఈ యాడ్ వీడియోలో కొన్ని వ్యాఖ్యలు కూడా ఉంటాయి. "తమ కన్నబిడ్డలా ఆదరించే ఇంటికి ఆమె కోడలిగా వెళ్లింది. ఆమె కోసం ఆ కుటుంబానికి చెందినవారు తమ సంప్రదాయాన్ని పక్కనబెట్టి వేడుక చేశారు. మామూలుగా అయితే ఇలా చేయరు. ఇది రెండు భిన్నమైన మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక" అంటూ తనిష్క్ అభివర్ణించింది.

ఈ తరహా అభివర్ణన నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఈ యాడ్ తో లవ్ జిహాద్ కు తనిష్క్ మద్దతు పలుకుతున్నట్టుగా ఉందని, ఈ ప్రకటనను నిషేధించాలని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయ్ కాట్ తనిష్క్ అనే హ్యాష్ ట్యాగ్ తో హోరెత్తించారు. నిన్న, ఇవాళ ఇదే ట్రెండింగ్ లో ఉండడంతో తనిష్క్ తన యాడ్ వీడియోను తొలగించింది.
Tanishq
Ad
Social Media
Ekatvam

More Telugu News