Hyderabad: వరుణుడి బాదుడు... హైదరాబాద్ జలమయం!
- భాగ్యనగరంలో కుంభవృష్టి
- ఉదయం నుంచి భారీ వర్షాలు
- నగరంలోని అనేక ప్రాంతాల్లోకి భారీగా చేరిన నీరు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఈ ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
బేగంపేట, మారేడ్ పల్లి, ఉప్పల్, ఎస్సార్ నగర్, సనత్ నగర్, పంజాగుట్ట, అమీర్ పేట, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమల గిరి, ఆల్వాల్, గోల్కొండ, పాతబస్తీ, మెహదీపట్నం, వెంగళ్రావు నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట్, కోఠి తదితర ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు వర్షం కురిసింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం నగరంలో మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిన్ననే హెచ్చరించింది. తాజాగా చేసిన ప్రకటనలో మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది.
కాగా, భారీ వర్షంతో హైదరాబాద్ లో జనజీవనం అస్తవ్యస్తం అయింది. అనేక ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద భారీగా నీరు చేరింది. ట్రాఫిక్ ఇబ్బందులు పతాకస్థాయికి చేరాయి. దాంతో జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.