Low Preasure: అంతులేని నష్టాన్ని మిగిల్చిన వాయుగుండం... ఇంకా ముప్పు తప్పలేదన్న ఐఎండి!
- బంగాళాఖాతంలో బలపడుతున్న మరో అల్పపీడనం
- రేపు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం
- ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, తీరం దాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రల మీదుగా ప్రయాణిస్తూ, బలహీనపడిన వేళ, అపార నష్టమే మిగిలింది. తీరం దాటిన తరువాత కూడా దాదాపు ఆరేడు గంటల పాటు వాయుగుండం బలహీన పడకపోవడంతో లక్షలాది ఎకరాల పంట ముంపునకు గురైంది. వందలాది కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. వేలాది వృక్షాలు విరిగిపడ్డాయి. ముఖ్యంగా వరంగల్, హైదరాబాద్ నగరాల్లో నష్టం భారీగా ఉందని అధికారులు వెల్లడించారు.
కాగా, తుపాను నష్టం ఇప్పట్లో అంచనా వేయలేమని అధికారులు అంటున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి, గంటగంటకూ అది బలపడుతూ ఉండటమే ఇందుకు కారణమని, ఇది కూడా వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం రేపు సాయంత్రం తరువాత వాయుగుండం అవుతుందని, ఆ తరువాత దాని కదలికలను అంచనా వేయాల్సివుందని తెలిపారు.
నిన్న తీరాన్ని దాటిన వాయుగుండం ఇంకా తెలుగు రాష్ట్రాలను వీడి వెళ్లలేదని, మరిన్ని వర్షాలకు అవకాశం ఉన్నందున అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ లో 90 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లను నియమించామని, వారంతా క్షేత్ర స్థాయిలో వరదనీటి ప్రవాహంపై దృష్టిని పెట్టారని ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఏపీలో అన్ని కలెక్టరేట్లూ నిరంతరాయంగా పనిచేస్తాయని, లోతట్టు ప్రాంతాల వారిని సహాయక శిబిరాలకు తరలించామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలియజేశారు. పంజాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 327 సహాయక బృందాలతో పనిచేస్తోందని, ఆ శాఖలో ఉద్యోగులకు సెలవులను రద్దు చేశామని ఆయన అన్నారు.