Telangana: భారీ వర్షాల ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ పరిధిలో నేడు, రేపు సెలవు
- అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు
- హైదరాబాద్లో జలదిగ్బంధంలో 1500 కాలనీలు
- లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం
భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు నేడు, రేపు సెలవు ప్రకటించింది. మరో రెండుమూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
నిన్న కురిసిన వర్షానికి నగరంలోని దాదాపు 1500 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. దీనికి తోడు హైదరాబాద్కు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం మరో మూడు రోజులపాటు ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.