KCR: భారీ వర్షాలపై చర్చించేందుకు మంత్రులు, అధికారులతో కేసీఆర్ నేడు అత్యవసర భేటీ
- మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో భేటీ
- కేంద్రానికి సమర్పించాల్సిన నివేదికపై చర్చ
- తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో మంత్రులు, అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉండడంతో ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలతో రావాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలంగాణ సీఎంవో తెలిపింది.
ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, పలు శాఖల కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరుకానున్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో కురిసిన వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితులు, జరిగిన నష్టం, అధికారులు తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అందాల్సిన వసతులపై కూడా వారు చర్చిస్తారు.