bihar: నా తండ్రి చివరి కోరికను నేను నెరవేర్చుతాను: చిరాగ్ పాశ్వాన్
- బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తా
- ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగితేనే పార్టీకి ఆదరణ
- బీజేపీతో మాత్రం పొత్తుకు కట్టుబడే ఉన్నా
- నితీశ్ కుమార్ సర్కారు తీరుపై పోరాడతాం
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. అయితే, ఇటీవల ఎన్డీఏ కీలక నేత, లోక్ జనశక్తి పార్టీ మాజీ అధ్యక్షుడు రాం విలాస్ పాశ్వాన్ కన్నుమూయడంతో ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఆధ్వర్యంలోని పార్టీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనుంది.
ఇటీవల ఆ పార్టీ జేడీయూ నేతలతో గొడవ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్‌తో విభేదాల నేపథ్యంలో ఈ సారి రాం విలాస్ పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేయాలని భావించారు. ఆయన మరణించినప్పటికీ ఆయన కుమారుడు కూడా అదే మాటపై ఉన్నారు. తాను ఒంటరిగా పోటీ చేస్తానని, ఇది తన తండ్రి కోరిక అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగితేనే తమ పార్టీకి ఆదరణ ఉంటుందని తెలిపారు. తాము ఎన్డీఏ నుంచి విడిపోయినప్పటికీ బీజేపీతో పొత్తుకు కట్టుబడే ఉన్నామని తెలిపారు. తాము నితీశ్ కుమార్ సర్కారు తీరుపై పోరాడతామని తెలిపారు. ఒంటరిగా బరిలో దిగాలన్నది తన తండ్రి అతిపెద్ద కల అని ఆయన అన్నారు. 2005లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయం బీజేపీలోని పలువురికి తెలుసని తెలిపారు.
నితీశ్ కుమార్ మరోసారి సీఎం అయితే మరో ఐదేళ్లు రాష్ట్ర ప్రజలు బాధపడతారని ఆయన చెప్పుకొచ్చారు. అది ప్రజల పాలిట పెను విపత్తు అవుతుందని తన తండ్రి భావించారని చెప్పుకొచ్చారు. తన తండ్రి మరణం తనను ఎంతగానో కుంగదీసిందని చెప్పారు. ఆయన ఆశయాలే తనకు బలమని, తన తండ్రి పాటించిన విలువలను తాను కొనసాగిస్తానని తెలిపారు.