Subhash Reddy: ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఉప్పల్ ఎమ్మెల్యే... విరుచుకుపడిన మహిళలు
- హైదరాబాద్ లో కుండపోత
- నీట మునిగిన నగరం
- రామాంతపూర్ లో పర్యటించిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి
- మహిళల ఆగ్రహాన్ని చవిచూసిన వైనం
హైదరాబాద్ నగరంలో వరుణుడి బీభత్సం అంతాఇంతా కాదు. దాదాపు నగరంలో అత్యధిక భాగం జలమయమైంది. ఏకధాటిగా కురిసిన వర్షంతో ప్రధాన రహదార్లు, కాలనీలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తన నియోజకవర్గం పరిధిలో పరిస్థితిని సమీక్షించేందుకు ఓ బోటులో వెళ్లగా, రామాంతపూర్ కు చెందిన మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడ్రోజుల నుంచి తమకు తిండి, నీళ్లు లేవని మండిపడ్డారు. దాంతో ఎమ్మెల్యే స్పందిస్తూ, మొదట తాను చెప్పేది వినిపించుకోవాలన్నారు. దాంతో ఓ మహిళ... మీరు చెప్పేది మాకు అవసరం లేదు అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు అలాగే మాట్లాడుతుంటే నేనేమీ చెప్పను అని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కొంచెం అసహనం ప్రదర్శించగా, ఎందుకు చెప్పరు? అంటూ ఆ మహిళే రెట్టించిన స్వరంతో ప్రశ్నించింది. చెప్పేది వినకుంటే నేనేం చేయను? అంటూ ఎమ్మెల్యే అనడంతో ఆ మహిళ కాస్త శాంతించింది.
అనంతరం సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ వర్షం అకస్మాత్తుగా వచ్చిందని, దీనికి ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. ఈ విపత్కర పరిస్థితి తన ఒక్కడి ఇంటికి మాత్రమే వచ్చింది కాదని, నగరం మొత్తం బాధపడుతోందని తెలిపారు. హఠాత్తుగా వచ్చిన ఈ వర్షానికి ఎవరూ బాధ్యత వహించరని పేర్కొన్నారు. పరిస్థితి పట్ల ఆ స్థానిక మహిళకు నచ్చచెప్పేందుకు ఆయన విఫలయత్నాలు చేశారు.
అయినా ఆ మహిళ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఎమ్మెల్యే బోటును ముందుకు పోనివ్వాలంటూ సిబ్బందికి పురమాయించారు. దాంతో ఆ మహిళ మరింత కోపంగా... మీరు ఎన్నికలప్పుడు కూడా ఇలాగే వచ్చి వెంటనే వెళ్లిపోతారా? అని నిలదీసింది.