Kings XI Punjab: గేల్ వచ్చాడు.. పంజాబ్ గెలిచింది!

Kings XI Punjab won by 8 wickets

  • ఎట్టకేలకు పంజాబ్ ఖాతాలో మరో విజయం
  • అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్న రాహుల్, గేల్
  • చివరి బంతి వరకు కొనసాగిన ఉత్కంఠ

ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎట్టకేలకు మరో విజయం సాధించింది. వరుస ఓటములకు బ్రేక్ వేసింది. గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఏడు మ్యాచ్‌ల తర్వాత జట్టులోకి వచ్చిన విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ వచ్చీ రావడంతోనే అర్ధ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల విజయ లక్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగా ఛేదిస్తుందని భావించారు. అయితే, చివరి ఓవర్‌లో చాహల్ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ ఓవర్‌లో పంజాబ్ విజయానికి రెండు పరుగులు అవసరం కాగా, ఉత్కంఠ చివరి బంతి వరకు కొనసాగింది. తొలి రెండు బంతులు డాట్ బాల్స్ కాగా, మూడో బంతికి గేల్ సింగిల్ రన్ తీశాడు. దీంతో మూడు బంతుల్లో విజయానికి ఓ పరుగు అవసరం. నాలుగో బంతి డాట్ బాల్ కాగా ఐదో బంతికి రాహుల్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. దీంతో గేల్ రనౌట్ అయ్యాడు.

ఇప్పుడు అందరిలోనూ ఒకే టెన్షన్. చివరి బంతికి సింగిల్ తీస్తే విజయం పంజాబ్‌ను వరిస్తుంది. లేకుంటే మ్యాచ్ టై అవుతుంది. క్రీజులోకి వచ్చిన పూరన్ ఏం చేస్తాడోనని అందరూ ఆసక్తిగా చూశారు. అయితే, పూరన్ మాత్రం చివరి బంతిని సిక్సర్‌గా మలిచి పంజాబ్ టెన్షన్‌ను దూరం చేశాడు. 49 బంతుల్లో ఫోర్, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసిన రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గేల్ 45 బంతుల్లో ఫోర్, ఐదు సిక్సర్లతో 53 పరుగులు చేశాడు.

అంతకుముందు బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది. అరోన్ ఫించ్ 20, పడిక్కల్ 18, సుందర్ 13, శివం దూబే 23, క్రిస్ మోరిస్ 25, ఉడానా 10 పరుగులు చేయగా, ఫామ్‌లో ఉన్న కోహ్లీ 39 బంతుల్లో 3 ఫోర్లతో 48 పరుగులు చేసి అర్ధ సెంచరీకి రెండు పరుగుల దూరంలో అవుటయ్యాడు. డివిలియర్స్ (2) నిరాశపరిచాడు. పంజాబ్ గెలుపు, బెంగళూరు ఓటములతో పాయింట్ల పట్టికలో మాత్రం ఎటువంటి మార్పులు జరగలేదు. కోహ్లీసేన 10 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా, ఈ విజయంతో మరో రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ పంజాబ్ మాత్రం అట్టడుగునే ఉంది.

  • Loading...

More Telugu News