Joe Biden: నేను అధ్యక్షుడినైతే 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులకు అమెరికా పౌరసత్వం ఇస్తా: జో బైడెన్
- వలసల సంక్షోభాన్ని నివారిస్తా
- ట్రంప్ వల్ల అమెరికాకు చాలా నష్టం జరిగింది
- కరోనాను ఎదుర్కోవడంలో కూడా విఫలమయ్యారు
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ తన ప్రచారంలో భారీ హామీ ఇచ్చారు. యూఎస్ ప్రెసిడెంట్ గా తాను గెలిస్తే... అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చిన 1.10 కోట్ల మందికి అమెరికా పౌరసత్వం ఇస్తామని చెప్పారు. ఆన్ లైన్లో నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ హామీ ఇచ్చారు. వలసల సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు.
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై బైడెన్ విమర్శలు గుప్పించారు. అమెరికాకు ట్రంప్ చేసిన నష్టాన్ని సరిచేసేందుకు చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారని... ఆయన అసమర్థత వల్ల 2 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని దుయ్యబట్టారు.