Muttaiah Muralidharan: తనపై వస్తున్న ఆరోపణలకు బదులిచ్చిన ముత్తయ్య మురళీధరన్
- తమిళంలో '800' పేరిట మురళీధరన్ బయోపిక్
- మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి
- ఆ పాత్ర పోషించవద్దంటూ సేతుపతిపై ఒత్తిళ్లు
- మురళీపై భారతీరాజా తదితరుల తీవ్ర ఆరోపణలు
శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవితంపై 800 పేరిట తమిళంలో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ముత్తయ్య మురళీధరన్ పాత్రను విజయ్ సేతుపతి పోషిస్తున్నారు. అయితే ముత్తయ్య బయోపిక్ లో నటించవద్దంటూ తమిళ సంఘాలు విజయ్ సేతుపతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దర్శకుడు భారతీరాజా కూడా వారితో గళం కలిపాడు. ముత్తయ్య శ్రీలంక ప్రభుత్వ మతవాదానికి మద్దతుదారు అని, అతడొక భారత ద్రోహి అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలకు ముత్తయ్య మురళీధరన్ లిఖితపూర్వకంగా స్పందించాడు.
తనకు వివాదాలు కొత్త కాదని, జీవితంలో అనేక సమస్యలు చుట్టుముట్టాయని, ఇది అంతకంటే భిన్నం కాదని తెలిపాడు. "ఈ సినిమా కోసం ఫిలింమేకర్స్ మొదట నన్ను సంప్రదించినప్పుడు అనుమతి ఇవ్వాలని అనుకోలేదు. కానీ ఈ సినిమాతో నా తల్లిదండ్రులు ఎదుర్కొన్న కష్టనష్టాలు, సంఘర్షణ, నా కోచ్ లు, టీచర్ల భాగస్వామ్యం, నా ఎదుగుదల వెనుక ఉన్న ప్రతి ఒక్కరి కృషి అందరికీ తెలుస్తుందనే బయోపిక్ కు అంగీకరించాను. శ్రీలంకలో తమిళుడిగా పుట్టడం ఏమైనా నా తప్పా? ఒకవేళ భారత్ లో పుట్టి ఉంటే టీమిండియాలో ఆడేందుకు ప్రయత్నించేవాడిని.
శ్రీలంక జాతీయ జట్టుకు ఆడడం ప్రారంభించింది మొదలు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నేను తమిళులకు వ్యతిరేకం అంటూ అవాంఛనీయ వివాదం రేకెత్తించారు. పైగా ఈ సినిమాకు రాజకీయ రంగు పులుముతున్నారు. గతంలో శ్రీలంక నరమేధానికి నేను మద్దతు పలికానని ఆరోపించారు. 2009 సంవత్సరం నా జీవితంలోనే అత్యుత్తమ కాలం అని పేర్కొంటే దాన్ని వక్రీకరించారు. నరమేధాన్ని ఆస్వాదిస్తూ ఆ వ్యాఖ్యలు చేశానని వక్రభాష్యం చెప్పారు.
ఇప్పటివరకు జాతి ప్రాతిపదికన నేను ఎవరినీ కించపరిచింది లేదు. సింహళీయులను కానీ, ఈలం తమిళులను కానీ, తమిళ గిరిజనులను కానీ పల్లెత్తు మాట అనలేదు. ఈలం తమిళ మహిళలు, చిన్నారుల అభ్యున్నతికి ఎంతగానో మద్దతిస్తున్నాను. చేసిన దానం చెప్పుకునే వ్యక్తిని కాను. అయితే నేను శ్రీలంకలో తమిళులకు ఎంతో సేవ చేశాననడానికి ఆధారాలు ఉన్నాయి. దయచేసి నాపై నిరాధారణ ఆరోపణలు చేయవద్దు" అంటూ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.