Police: కొల్లాపూర్ వద్ద కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టు.. ఉద్రిక్తత!
- నిన్న రాత్రి కల్వకుర్తి లిఫ్ట్ మునక
- 14 అంతస్తుల్లోని పంప్ హౌస్‌లో పది అంతస్తుల్లోకి నీరు
- ప్రమాద స్థలిని పరిశీలించేందుకు కొల్లాపూర్ వెళ్లిన రేవంత్
- అడ్డుకున్న పోలీసులు.. ట్వీట్ చేసిన రేవంత్
నాగర్‌కర్నూల్ జిల్లా ఎల్లూరు వద్ద కృష్ణా నది ఒడ్డున మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథక మొదటి దశ లిఫ్టు పంపుహౌస్ లోపల నిన్న సాయంత్రం పంపింగ్ నడుస్తున్న సమయంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మోటారు బిగించిన ఫౌండేషన్ బోల్టులు ఒక్కసారిగా ఎగిరిపడడంతో పంప్‌హౌస్ గోడని చీల్చుకొని ఫౌండేషన్ రాడ్లు, మోటార్ల పరికరాలు దూసుకెళ్లాయి.
దీంతో సర్జిపూల్ నుంచి వరదనీరు భారీగా పంప్‌హౌస్‌లోకి చేరింది. కొన్ని నిమిషాల్లోనే పంప్‌హౌస్‌లోని 14 అంతస్తుల్లోేని పది అంతస్తుల్లోకి నీరు చేరిపోయిందంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోటార్లను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో అక్కడి సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజు ప్రమాద స్థలిని పరిశీలించేందుకు కొల్లాపూర్ వెళ్లిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, మల్లు రవి, సంపత్ కుమార్ లను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీనిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్న శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదం, నేడు కల్వకుర్తి లిఫ్ట్ మునక... ప్రమాద స్థలికి ప్రతిపక్షం వెళితే ప్రభుత్వానికి ఉలుకెందుకు? ఖాకీ పహారతో నిజాన్నెందుకు దాస్తోంది. ఆలోచించు తెలంగాణమా’ అని అన్నారు.