Gautam Gambhir: కెప్టెన్ ను మార్చడం కోసం కార్తీక్ పై ఒత్తిడి తీసుకురావడం అవసరమా?: గంభీర్

Gambhir questions KKR Captaincy change in the middle of IPL ongoing season
  • కోల్ కతా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న దినేశ్ కార్తీక్
  • కొత్త కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్
  • టోర్నీ మధ్యలో ఈ మార్పేంటని ప్రశ్నించిన గంభీర్
ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ మార్పు అంశంపై స్పందించాడు. టోర్నీ మధ్యలో కెప్టెన్ ను మార్చడం ఏంటని ప్రశ్నించాడు. క్రికెట్ అనేది బంధాలకు సంబంధించిన విషయం కాదని, అది ప్రదర్శన మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాడు.

టోర్నీ సగంలో ఉన్నప్పుడు దినేశ్ కార్తీక్ ను ఎందుకు తప్పించారో అర్థం కావడంలేదని, కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్న ఇయాన్ మోర్గాన్ ఇప్పటికిప్పుడు పరిస్థితులను మార్చగలడని తాను భావించడంలేదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. టోర్నీ మొదటి నుంచి కెప్టెన్ గా వ్యవహరించి ఉంటే ఏమైనా మార్పు తీసుకువచ్చేవాడేమోనని తెలిపాడు.

"వరల్డ్ కప్ విజేత అయిన మోర్గాన్ ను కెప్టెన్ గా చేయాలని అనుకుని ఉంటే టోర్నీ ఆరంభంలోనే నియమించాల్సింది. కార్తీక్ పై ఇంత ఒత్తిడి తీసుకురావడం అవసరమా? అయినా, సీజన్ మధ్యలో కెప్టెన్ ను మార్చడం ఏంటి? కార్తీక్ సారథ్యంలో కోల్ కతా జట్టు 7 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించింది. ఇలాంటి మెరుగైన పరిస్థితుల్లో తన బ్యాటింగ్ పై దృష్టి సారించేందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని కార్తీక్ చెప్పడం సరికాదు. గత రెండేళ్లుగా కార్తీక్ జట్టును బాగానే నడిపిస్తున్నాడు. ఇప్పటికిప్పుడు కెప్టెన్ ను మార్చాల్సినంత దారుణమైన పరిస్థితిలో కోల్ కతా జట్టులేదు. కోచ్ కు కెప్టెన్ కు మధ్య మంచి అనుబంధం ఉండడం ఎంతో అవసరం" అంటూ గంభీర్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టాడు.

గంభీర్ గతంలో కోల్ కతా నైట్ రైడర్స్ కు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. 2012 సీజన్ లో కోల్ కతా జట్టు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన సమయంలో గంభీరే కెప్టెన్.
Gautam Gambhir
KKR
Captaincy
Dinesh Karthik
Eoin Morgan

More Telugu News