China: చైనాలో అద్భుతం.. కనువిందు చేసిన ముగ్గురు సూర్యులు!
- దాదాపు 3 గంటల పాటు అద్భుత దృశ్యం ఆవిష్కృతం
- వీటిని ఫాంటమ్ సన్స్ అని కూడా పిలుస్తారు
- ఈ ఏడాది ప్రారంభంలో రష్యాలో కూడా కనిపించిన సుందర దృశ్యం
చైనాలోని మోహే నగరంలో ఒక అద్భుతం కనువిందు చేసింది. ఆకాశంలో ఒకేసారి ముగ్గురు సూర్యులు కనిపించడంతో స్థానికులు మైమరచిపోయి ఆ అద్భుతాన్ని వీక్షించారు. నిన్న ఉదయం 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకు దాదాపు 3 గంటల పాటు ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. సైన్స్ ప్రకారం సూర్యుడికి రెండు వైపులా ప్రతిబింబాల్లా కనిపించే ఈ సూర్య బింబాలను 'ఫాంటమ్ సన్స్' అంటారు. వీటిని 'సన్ డాగ్స్'గా కూడా పిలుస్తారు.
సూర్యకాంతి సిర్రస్ మేఘాల్లోని మంచు స్ఫటికాల గుండా ప్రయాణించినప్పుడు... సూర్యుడికి ఇరువైపులా మరో రెండు సూర్యులు ఉన్నట్టుగా ఏర్పడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మంగోలియాలో కూడా ఫాంటమ్ సన్స్ కనిపించాయి. 2015లో రష్యాలో ఇలాంటి దృశ్యమే అక్కడి ప్రజలకు కనువిందు చేసింది. చైనాలో ఈ ఉదయం కనిపించిన ఫాంటమ్ సన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.