Taiwan: తైవాన్ పై కారాలుమిరియాలు నూరుతున్న చైనా... ఫిజీలో దౌత్య సిబ్బందిపై దాడి
- చైనా, తైవాన్ అధికారుల మధ్య ఫిజీలో ఘర్షణ
- తీవ్రంగా గాయపడిన తైవాన్ దౌత్యాధికారి
- ఘటనపై స్పందించని చైనా విదేశాంగ శాఖ
తమ సార్వభౌమత్వానికి సవాల్ గా నిలుస్తోందన్న కారణంగా తైవాన్ పై చైనా గుర్రుగా ఉంది. ఫిజీలో తైవాన్ దౌత్యసిబ్బందిపై చైనా దౌత్యసిబ్బంది దాడి చేయడమే అందుకు నిదర్శనం. తైవాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఫిజీ రాజధాని సువాలో అక్టోబరు 8న ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫిజీలో ఉన్న అనేక దేశాల దౌత్య సిబ్బందితో పాటు చైనా దౌత్యాధికారులను కూడా తైవాన్ ఎంబసీ అధికారులు ఆహ్వానించారు.
అయితే ఓ చైనా దౌత్యాధికారి ఆ కార్యక్రమానికి వచ్చిన అతిథులను ఫొటోలు తీస్తుండడం పట్ల తైవాన్ అధికారి అభ్యంతరం చెప్పారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా అధికారి కోపోద్రిక్తుడై తైవాన్ అధికారిపై దాడికి దిగాడు. ఈ ఘర్షణలో తైవాన్ అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
ఈ ఘటనపై తైవాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఫిజీలో చైనా దౌత్యాధికారులు తమ పరిధి మీరి దురుసుగా ప్రవర్తించారని వ్యాఖ్యానించింది. దీనిపై ఫిజీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్యవహారంపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు స్పందించలేదు.