Javed Miandad: ధోనీని చూస్తుంటే మ్యాచ్ కు అవసరమైన ఫిట్ నెస్ తో ఉన్నట్టు కనిపించడంలేదు: మియాందాద్
- ఈ ఐపీఎల్ లో మందకొడిగా ఆడుతున్న ధోనీ
- ఫిట్ నెస్ సలహాలు ఇచ్చిన పాక్ దిగ్గజం
- ధోనీ వ్యాయామం చేసే సమయం పెంచుకోవాలన్న మియాందాద్
ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తున్న వారికి ధోనీ ఆటతీరు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో లాగా వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తలేకపోతున్న ధోనీని చూసి అభిమానులు సైతం విస్మయానికి గురవుతున్నారు. మునుపటి ధోనీకి భిన్నంగా బాగా బరువు పెరిగిన ధోనీని చూసి పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం జావెద్ మియాందాద్ సైతం పెదవి విరిచాడు. మైదానంలో ధోనీని గమనిస్తుంటే మ్యాచ్ కు అవసరమైన ఫిట్ నెస్ తో ఉన్నట్టు కనిపించడంలేదని వ్యాఖ్యానించాడు.
ధోనీ మెరుగైన ఆటతీరు కనబర్చాలంటే తన ఫిట్ నెస్ పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ ఐపీఎల్ లో ధోనీ బ్యాటింగ్ చూశానని, అతడి టైమింగ్, శారీరక ప్రతిస్పందనలు గమనిస్తే ఎంతో మందకొడిగా ఉన్నట్టు అర్థమవుతోందని అన్నాడు. ఓ ఆటగాడు పరిపూర్ణ మ్యాచ్ ఫిట్ నెస్ తో లేకపోతే ఆ ప్రభావం అతడి టైమింగ్, శారీరక ప్రతిస్పందనలపై పడుతుందని మియాందాద్ వివరించాడు. ధోనీ తనను తాను పరిశీలించుకోవాలని సూచించాడు.
"సుదీర్ఘకాలం పాటు క్రికెట్ కు దూరంగా ఉన్న ధోనీ ఈ ఐపీఎల్ తోనే మళ్లీ క్రికెట్ లోకి వచ్చాడు. ఐపీఎల్ కు ముందు మ్యాచ్ ప్రాక్టీసుకు అతడికి పెద్దగా సమయంలేదు. చాలాకాలం పాటు క్రికెట్ కు దూరంగా ఉండి మ్యాచ్ ఫిట్ నెస్ సాధించడం ఏమంత సులభం కాదు" అని అభిప్రాయపడ్డాడు.
అయితే, ధోనీకి తాను కొన్ని సలహాలు ఇస్తానని, వ్యాయామం చేసే సమయాన్ని ధోనీ మరింతగా పెంచుకోవాలని అన్నాడు. "ఉదాహరణకు 20 సిటప్ లు తీస్తుంటే వాటిని 30కి పెంచుకోవాలి. 5 స్ప్రింట్లు కొడుతుంటే వాటి సంఖ్యను 8కి పెంచుకోవాలి. నెట్స్ లో బ్యాటింగ్ కోసం గంట సమయం కేటాయిస్తుంటే ఆ సమయాన్ని 2 గంటలకు పెంచుకోవాలి. అయితే ఇదంతా ఏకబిగిన చేయాల్సిన అవసరంలేదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు సెషన్లలో చేయొచ్చు" అంటూ మియాందాద్ వివరించాడు.