Pakistan: సింధ్ పోలీస్ చీఫ్ ను కిడ్నాప్ చేసిన ఆర్మీ... పౌర యుద్ధం దిశగా పాకిస్థాన్!

Civil War like Situation in Pakistan

  • కనిపించకుండా పోయిన సింధ్ పోలీస్ చీఫ్
  • విచారణకు ఆదేశించిన ఆర్మీ చీఫ్ ఖమార్ జావేద్
  • నవాజ్ అల్లుడి అరెస్ట్ తరువాత పరిస్థితి విషమం
  • కీలక నిర్ణయాలు తీసుకోనున్న సైన్యం
  • వెల్లడించిన 'ది ఇంటర్నేషనల్ హెరాల్డ్'

పాకిస్థాన్ లో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. ఇప్పటికే, ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా, తాజాగా, సింధ్ పోలీస్ చీఫ్ ను సైన్యం కిడ్నాప్ చేసిందంటూ వచ్చిన వార్తలపై ఆర్మీ చీఫ్ జనరల్ ఖమార్ జావేద్ బజ్వా విచారణకు ఆదేశించడంతో, మరోమారు పౌర యుద్ధం దిశగా దేశం అడుగులు వేస్తోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు సఫ్దర్ ఖాన్ ను అరెస్ట్ చేయాలని కరాచీ పోలీసులపై సైన్యం ఒత్తిడిని ప్రారంభించిన తరువాత పరిస్థితి మరింత విషమంగా మారినట్టు తెలుస్తోంది.

'ది ఇంటర్నేషనల్ హెరాల్డ్' కథనం ప్రకారం, పాక్ ఆర్థిక రాజధానిగా ఉన్న కరాచీలో జరిగిన అల్లర్లలో 10 మంది పోలీసు అధికారులు మరణించారు. దీంతో పోలీసులు, ఆర్మీ మధ్య తీవ్ర స్థాయిలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. అయితే, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఆర్మీ చీఫ్ బజ్వా నుంచి కరాచీ పోలీసు అధికారులకు పలు ఆదేశాలు వెళ్లాయని, క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని బజ్వా ఆదేశించినట్టు పేర్కొంది.

అయితే, జరుగుతున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన మరిన్ని వివరాలను మాత్రం పత్రిక వెల్లడించలేదు. పీపీపీ చైర్ పర్సన్ బిలావల్ భుట్టో జర్దారీ స్పందిస్తూ, విచారణ నిస్పక్షపాతంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సింధ్ పోలీస్ చీఫ్ ఎక్కడున్నారో వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల కరాచీలో జరిగిన ఓ ర్యాలీ తరువాత పాక్ రాజకీయ వాతావరణం మారిపోయింది. ఈ ర్యాలీలో పీఎంఎల్-ఎన్ వైస్ ప్రెసిడెంట్ నవాజ్ అల్లుడు సఫ్దర్ తో పాటు ఆయన భార్య మర్యమ్ కూడా పాల్గొన్నారు. ఇదే ర్యాలీలో పాక్ డెమొక్రటిక్ మూమెంట్ పార్టీ కూడా పాల్గొని సంఘీభావం తెలిపింది.

ఆ వెంటనే హోటల్ రూమ్ లో ఉన్న సఫ్దర్ ను కరాచీ పోలీసులు అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకోవడంతో పరిస్థితి విషమించింది. ఇదే సమయంలో పోలీస్ ఉన్నతాధికారి కనిపించకుండా పోవడంతో సైన్యంపై ప్రజలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్న ప్రజలకు, పోలీసులు వంత పాడుతుండటంతో, సైన్యం పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News